
విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు, గృహ అద్దెలు -ప్రతి కుటుంబం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఉద్యోగుల ఆదాయం మాత్రం అదే వేగంతో పెరగడం లేదు. వేతన సవరణ ఆలస్యం కావడంతోపాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆరు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆరు డి.ఎ.ల మొత్తం కలిపితే పి.ఆర్.సి. ఫిట్‌మెంట్లో 50శాతం వరకు ఉంటుంది. రావలసిన వీటి లోటుతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. పి.ఆర్.సి. అనేది ప్రభుత్వం ఇచ్చే దాతృత్వం కాదు. ఉద్యోగుల సేవలకు కాలానుగుణంగా ఇచ్చే న్యాయమైన గుర్తింపు.
‘వాగ్దానాలు వినిపిస్తున్నాయి.. సమావేశాలు జరుగుతున్నాయి.. ప్రకటనలు వస్తున్నాయి.. కానీ పి.ఆర్.సి. మాత్రం కనిపించడం లేదు. ‘నేడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మనసులో వినిపిస్తున్న నిశ్శబ్ద ఆవేదన ఇదే. ఒకప్పుడు ప్రతి వేతన సవరణ ఉద్యోగుల జీవితంలో కొత్త ఆశలను నింపేది. కానీ ఇప్పుడు పి.ఆర్.సి. అనే మాట ఆశ కంటే అనిశ్చితికే ప్రతీకగా మారుతోంది. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే ఉద్యోగులే ప్రధాన బలం. ‘పల్లె పాఠశాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ల కార్యాలయం వరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించేది ఉద్యోగులే. ‘ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి కృషి వల్లే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. అలాంటి ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పి.ఆర్.సి. నిరవధికంగా ఆలస్యం కావడం సహజంగానే ఆందోళనకు దారితీస్తోంది. గత కొన్నేళ్లుగా జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. మరి ముఖ్యంగా ఇరాన్ అమెరికా యుద్ధం పరిణామాల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చి వేతన జీవితలపై కరాళ నృత్యం చేస్తున్నాయి. విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు, గృహ అద్దెలు -ప్రతి కుటుంబం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
అయితే ఉద్యోగుల ఆదాయం మాత్రం అదే వేగంతో పెరగడం లేదు. వేతన సవరణ ఆలస్యం కావడంతోపాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆరు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆరు డి.ఎ.ల మొత్తం కలిపితే పి.ఆర్.సి. ఫిట్‌మెంట్లో 50శాతం వరకు ఉంటుంది. రావలసిన వీటి లోటుతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. పి.ఆర్.సి. అనేది ప్రభుత్వం ఇచ్చే దాతృత్వం కాదు. ఉద్యోగుల సేవలకు కాలానుగుణంగా ఇచ్చే న్యాయమైన గుర్తింపు. ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడం, సేవా ఉత్సాహాన్ని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. కాబట్టి దీన్ని ఆలస్యం చేయడం అనేది వేలాది కుటుంబాల ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేసే అంశం. ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాయి. వినతిపత్రాలు సమర్పించాయి. చర్చలు జరిపాయి. అయినప్పటికీ స్పష్టమైన కాలపట్టిక లేకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది. అనిశ్చితి ఎప్పుడూ అసంతృప్తికి దారి తీస్తుంది. అసంతృప్తి పని సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా తనవైపు ఆర్థిక పరిమితులు, సంక్షేమ పథకాల భారం, ఆదాయ -వ్యయ సమతుల్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటుందనేది వాస్తవం.
కానీ ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ఉద్యోగుల న్యాయమైన ఆశలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిష్కారం కాదు. పరిపాలనలో ఉద్యోగులు భాగస్వాములు; వారిని భాగస్వాములుగానే చూడాలి. ప్రభుత్వం -ఉద్యోగుల సంబంధం విశ్వాసంపై నిలబడాలి. ఆ విశ్వాసాన్ని బలపరచేది పారదర్శకత. పి.ఆర్.సి.పై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ, కాలపట్టిక, అమలు విధానాన్ని ప్రకటిస్తే ఉద్యోగుల్లో ఉన్న అనిశ్చితి తొలగుతుంది. నిర్ణయం ఆలస్యం కావడం కంటే, స్పష్టత లేకపోవడమే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలలోనే పి.ఆర్.సి.ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి సుమారు మూడు సంవత్సరాలు దగ్గరపడుతున్నా కేవలం కమిషన్ వేసి ఎంతో ఆర్భాటంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా తీసుకొని కనీసం కమిషన్ రికమండేషన్స్ కూడా బహిర్గతం చేయకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వాలు పి.ఆర్.సిలు ఆలస్యం చేయడం వల్ల సుమారుగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ ఉద్యోగ జీవితంలో రెండు పి.ఆర్.సిలను కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ‘పత్తాలేని పి.ఆర్.సి.’ అనే పదబంధం కేవలం ఒక శీర్షిక కాదు; వేలాది ఉద్యోగుల మనోభావాలకు అద్దం పట్టే మాట.
ఈ పరిస్థితి ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. ఉద్యోగి గౌరవం కాపాడబడితేనే ప్రభుత్వ పరిపాలనమరింత బలపడుతుంది. ఉద్యోగి సంతృప్తిగా ఉంటేనే ప్రజా సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయి. చివరగా, ఉద్యోగులు కోరేది అసాధారణమైన వరం కాదు. సమయానికి రావాల్సిన వేతన సవరణ, స్పష్టమైన నిర్ణయం, నమ్మకాన్ని పెంచే చర్యలు మాత్రమే. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పరస్పర చర్చల ద్వారా త్వరితగతిన పరిష్కారానికి చేరుకోవాలని ప్రతి ఉద్యోగి, ప్రతి కుటుంబం ఆశిస్తోంది. ‘ప్రస్తుతం ఎలినోన్ వాతావరణ పరిస్థితి ద్వారా ఏ విధంగా వేడి ఉక్కపోతతో సతమతం చేస్తుందో అదే విధంగా పి.ఆర్.సి. కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలలో తీవ్ర నిరాశ వేడిని రగులుస్తుంది. ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకున్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం వారికి కావలసిన పి.ఆర్.సి.ని కూడా ఉద్యమాలు నిర్మించి సాధించుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పి.ఆర్.సి. ఫైళ్లలో కాకుండా ఉద్యోగుల జీవితాల్లో నగదు జీతం రూపకంగా కనిపించిన రోజే వారి నిరీక్షణకు నిజమైన ఫలాలు లభిస్తాయి.
బొల్లం సునీల్‌కుమార్











