కోజికోడ్(కేరళ) కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాలపై కేరళ అసెంబ్లీ విపక్ష నాయకుడు పినరయి విజయన్ ధ్వజమెత్తారు. ఆయన రాజకీయ విధానాలు ఇండియా కూటమిని బలోపేతం చేయకపోగా, తరచుగా బీజేపీకే మేలు చేసేలా ముగుస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ కేరళలో తమ రాజకీయ ప్రత్యర్థి అయినందున విజయన్‌ను హత్తుకోలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ ఎవరు ఎవర్ని హత్తుకున్నారో తాను పట్టించుకోలేదన్నారు.

“కానీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని హత్తుకున్నట్టు ఉన్న ఫోటోను తామంతా చూశామన్నారు. నా అభ్యంతరం మోడీని కౌగిలించుకోవడం అనే చర్యపై కాదు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక నిర్ధిష్టమైన సందేశాన్ని అందిస్తున్నాయి. ఇండియా కూటమిని ఆయన ఏ దృష్టితో చూస్తున్నారో ఇది ప్రతిబింబిస్తుంది” అని విజయన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై విస్తృతమైన చర్చ జరగాలన్నారు. దీనిపై మరింత దూరం పోదల్చుకోలేదన్నారు. ఇండియా కూటమి ఈరోజు ఒక ముఖ్యమైన స్థాయికి చేరిందన్నారు. కేవలం మాకే కాదు. అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతోపాటు ప్రధాన కాంగ్రెసేతర పార్టీలు సమావేశంలో కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడి అభ్యంతరాలు లేవదీశారన్నారు. “ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ విధానాల వల్లే , ముఖ్యంగా రాహుల్ వల్లనే ఏర్పడింది. వాస్తవానికి ఇలాంటి విధానాలు ఇండియా కూటమిని బలోపేతం చేయవు”అని స్పష్టం చేశారు.