బండి-ఈటల చేతులు కలిపితే బిజెపి అధికారంలోకి వస్తుందా?

ముగ్గురు కమలనాధుల అహం సంగతేమిటీ ?

మళ్ళీ ఫైర్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బిజెపి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ చేతులు కలపడంతోనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందా? అని ఇదివరకే పార్టీ నుంచి సస్పెనన్‌కు గురైన ఎమ్మెల్యే రాజా సింగ్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ మంచి ఆలోచనతో వారిని కూర్చొబెట్టి నచ్చజెప్పడం బాగానే ఉంది కానీ ఇద్దరు ముగ్గురు నేతల అహం (ఇగో)తో పార్టీకి ఎంత నష్టం జరిగిందో జాతీయ నాయకత్వానికి చెప్పండి అని సూచించారు.

ఆదివారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏమిటీ?, వారిని ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. గతంలో చాలామంది మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలుపొందారని, వారి సమస్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అని ఆయన ప్రశ్నించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల్లో మూడు మేయర్ పదవులు గెలుస్తామని పార్టీ నేతలు అంటున్నారని, అయితే కార్పొరేషన్‌లలో పార్టీ విజయం సాధించేంత బలంగా ఉందా అని తెలుసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

సగం సీట్లు గెలిచి చూపించండి

మూడు కార్పొరేషన్ మేయర్‌లు గెలవడం కాదు.. ఒకటి కూడా కాదు..ఒక కార్పొరేషన్‌లోని సగం సీట్లు గెలిచి చూపించండి..అని ఎమ్మెల్యే రాజాసింగ్ నాయకత్వానికి సవాల్ విసిరారు. పార్టీ పని తీరును బట్టి తనకు అలా అనిపిస్తున్నదని అన్నారు. కొంత మందికి అధ్యక్ష పదవి రావొద్దని అ పదవిలో ఎన్. రాంచందర్ రావుని కూర్చోపెట్టారని ఆయన తెలిపారు. రాంచందర్ రావు చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. దీంతో రాంచందర్ రావు ఎంత బాధలో ఉన్నారో తనకు తెలుసునని అన్నారు. ఒకే ఒక్క వ్యక్తి తాము చెప్పినట్లే పని చేయాలని చెపితే ఎట్లా చేస్తారని ఆయన ప్రశ్నించారు. మీ చేతులు కట్టేసిన వాళ్ళ గురించి కేంద్ర పెద్దలకు చెప్పాలని ఆయన రాంచందర్ రావుకు సూచించారు. తనలాంటి వాళ్ళు పార్టీలోకి వచ్చి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారని ఆయన తెలిపారు. మీ భిక్షం తనకు వద్దు అని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.