
న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంఘర్షణ వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి దేశ పౌరులకు ప్రధాని నరేంద్రమోడీ చేసిన విజ్ఞప్తులపై కాంగ్రెస్ అగ్రనేత లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు వైఫల్యానికి నిదర్శనమని, సవాళ్లకు రాజీపడ్డారని,ఇక దేశాన్ని నడపలేరని విమర్శించారు. ఈమేరకు రాహుల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆదివారం మోడీ ప్రజలను త్యాగాలు చేయాలని పిలుపునిచ్చారు.
బంగారం కొనవద్దు, విదేశాలకు వెళ్లవద్దు, పెట్రోల్ తక్కువగా వాడండి, ఎరువులు , వంటనూనె వాడకం తగ్గించండి. మెట్రోలో ప్రయాణించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి వంటి విజ్ఞప్తులను దేశ ప్రజలకు చేశారు. ఇవి సలహాలు కావు, వైఫల్యానికి నిదర్శనం. గత 12 ఏళ్లలో దేశం ఇప్పుడు ప్రజలకు ఏమి కొనాలి? ఏమి కొనకూడదు? ఎక్కడికి వెళ్లకూడదు? అని చెప్పాల్సిన దుస్థితికి చేరుకుంది. తన జవాబుదారీ తనం నుంచి తప్పించుకోవడానికి ,మోడీ పదేపదే బాధ్యతలను ప్రజల పైకి నెడుతున్నారు. రాజీపడిన ప్రధాని ఇకపై దేశాన్ని నడపగల సమర్థుడు కాదని రాహుల్ విమర్శించారు.















