
దేశవ్యాప్తంగా శనివారం నాడు సెల్‌ఫోన్ వినియోగదారుల ఫోన్లు గట్టి శబ్దం లేదా వైబ్రేషన్‌తో కాసేపు మోతమోగనున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్యర్యంలో సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ పరీక్షలు జరపనున్నారు. పరీక్ష సమయంలో ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ సమయంలో ఫోన్ గట్టి శబ్దంతో మోగుతుంది. సంబంధిత విపత్తు నిర్వహణ సందేశం కూడా బయటికి వినపడుతుంది. దేశంలో అలర్ట్ వ్యవస్థ ఏరకంగా పనిచేస్తున్నది దీని ద్వారా తెలుస్తుంది. ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రజలకు సందేశాన్ని వెంటనే చేరవేసేందుకు ఇది దోహదపడుతుందని, అందుకే అలర్ట్ సందేశాన్ని సెల్‌ఫోన్ వినియోగదారులందరికీ పంపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.










