మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై సమావేశం కానున్న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ

బ్యారేజీల మరమ్మతులు, భవిష్యత్ నిర్వహణపై చర్చించనున్న ఎన్‌డిఎస్

తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తాం

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను తమ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళతాం

కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఈనెల 31వ తేదీన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం నిర్వహించనుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. బ్యారేజీల భద్రత, మరమ్మతులు, భవిష్యత్ నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీనిచ్చారు. అటు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను తమ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళతామని మంత్రి ఉత్తమ్ చాలెంజ్ చేశారు.

ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివ కుమార్‌తో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్‌లు సమావేశమయ్యారు. కర్ణాటక, తెలంగాణ అంతరాష్ట్ర నదీ జలాల అంశాలపై వారు చర్చించారు. తుంగభద్ర, కృష్ణ నదీ జలాలు అంత రాష్ట్ర జల అంశాలపై కీలకంగా వారు చర్చించినట్టుగా తెలిసింది. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి కెటిఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరంపై బిఆర్‌ఎస్ పిచ్చి రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కెటిఆర్ బాధ్యత లేకుండా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. అయితే, ఇసుక నేలపై కాళేశ్వరానికి పునాది వేశారని మంత్రి ఆరోపించారు. దీనికి సంబంధించి ఐఐటీ బాంబే ఆఫ్రి కంపెనీతో సాయిల్ టెస్ట్ చేయించారని మంత్రి పేర్కొన్నారు.

నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టుకు రూ.16వేల కోట్ల వడ్డీ

బ్యారేజీలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని వాటిని ప్రారంభిస్తే ప్రజలకు ఏమైనా జరగొచ్చని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ కాసుల కక్కుర్తి అసమర్ధత వల్ల కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి పేర్కొన్నారు. నాణ్యత లోపాలతో కాళేశ్వరం కట్టారని, వారు సరిగ్గా కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం కట్టిన వారం రోజుల్లోనే లీకేజీ జరిగిందని ఆయన అన్నారు. ఈ విషయం కెసిఆర్‌కు సైతం తెలుసనీ ఆయన పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి సహా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పినా కెసిఆర్ పట్టించుకోలేదన్నారు. సుమారు మూడేళ్లుగా నిరుపయోగంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. బ్యారేజీలో 2.3 టిఎంసీల నీటిని నిల్వ చేయమంటే 10 టిఎంసీల నీటిని ఎందుకు స్టోర్ చేశారని ఆయన ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్‌డిఎస్‌ఏ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటాం

ఎన్‌డిఎస్‌ఏ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిపుణుల సాయంతో వీలైనంత త్వరగా బ్యారేజీ మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు కాళేశ్వరం నుంచి చుక్కనీటిని వాడకుండానే దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ 18 కిలోమీటర్ల దూరం ఉందని, అన్నారం బ్యారేజీకి రంధ్రాలు ఉన్నాయని సిడబ్లూపిఆర్‌ఎస్ రిపోర్ట్ ఇచ్చిందని ఎన్‌డిఎస్‌ఏ మొదట ప్రిలిమినరీ రిపోర్ట్ నవంబర్ 23వ తేదీన ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం కాంట్రాక్టర్ రూ.1400 కోట్లను చెక్ రూపంలో బిఆర్‌ఎస్ ఇచ్చారని కవిత చెప్పడం వాస్తవమని ఆయన అన్నారు.