
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు రాష్ట్రానికి అనుకూలమైన వర్షపాతం నమోదై రిజర్వాయర్లు సమృద్ధిగా నిండాయని, సాగు, తాగునీటి అవసరాలు సాఫీగా నెరవేరాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ అవాసాలో ‘సింపోజియం‘ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాతావరణ మార్పులు అంశంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణలో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని ఆయన పేర్కొన్నారు. నిపుణులు సూచిస్తున్న ‘సూపర్ ఎల్ నినో‘ పరిస్థితులను ప్రభుత్వం అత్యంత గంభీరంగా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగ కుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ముందస్తు నీటి నిర్వహణపై దృష్టి వర్షాభావం తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే పరిస్థితులను అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి తెలిపారు.
నీటిపారుదల, వ్యవసాయం, తాగునీరు, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. రిజర్వాయర్ల నిర్వహణలో రియల్‌టైమ్ డేటా వినియోగం, శాస్త్రీయ నిర్ణయాలు, శాఖల మధ్య సమన్వయంతో ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పాలనకు ఇదే అసలైన పరీక్ష వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల నుంచి రైతులను రక్షించగలగడమే ప్రభుత్వాల అసలైన పరీక్ష అని మంత్రి పేర్కొన్నారు.











