
కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేముందు ఆ ప్రశ్న సరైనదేనా అని అడగాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి చర్చ ఒకే విధంగా పుట్టదు. కొన్ని చర్చలు సమాజం అవసరం వల్ల వస్తాయి. మరికొన్ని రాజకీయాల అవసరం వల్ల వస్తాయి. ఈ రెండింటి మధ్య తేడా గుర్తించకపోతే సమాధానం ఎంత సరైనదైనా అది అసలు ప్రశ్ననుంచి తప్పించుకోవచ్చు. నేడు రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చ కూడా అలాంటిదే. పైకి చూస్తే అది ఒక విధానం గురించి చర్చలా కనిపిస్తుంది. కానీ కొంచెం లోతుగా చూస్తే అది భారత ప్రజాస్వామ్యం తన గురించి తాను వేసుకోవాల్సిన ఒక పెద్ద ప్రశ్నను తాకుతుంది. అదే ‘సామాజిక న్యాయం పూర్తయిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియకుండా దాన్ని సాధించే విధానాలపై తీర్పు చెప్పడం అంటే గమ్యానికి చేరామో లేదో చూడకుండానే ప్రయాణాన్ని ఆపేయాలని నిర్ణయించడం లాంటిది. జర్మన్ తత్వవేత్త యుర్గన్ హెబెర్మాస్ ఆధునికతను ఒక అసంపూర్ణ ప్రాజెక్టు (an incomplete project) గా అభివర్ణించాడు.
ఈ భావనలోని అసలు బలం ఒకే మాటలో ఉంది. అసంపూర్ణమంటే విఫలం అని కాదు. ఇంకా పూర్తి చేయాల్సిన బాధ్యత మిగిలి ఉందని అర్థం. ప్రతి అసంపూర్ణ ప్రాజెక్టుకు ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి అది పూర్తి కాలేదు అని చెప్పి విఫలమైందని ప్రకటించడం. రెండోది ఎందుకు పూర్తికాలేదో అర్థం చేసుకొని దాన్ని పూర్తి చేసే బాధ్యతను స్వీకరించడం. భారత ప్రజాస్వామ్యం ముందు కూడా నేడు అదే ఎంపిక ఉంది. రిజర్వేషన్లపై చర్చ చివరికి ఆ ఎంపిక గురించే. రాజ్యాంగ నిర్మాతలు ఒక గొప్ప నైతిక సత్యాన్ని గుర్తించారు. చట్టం సమానత్వాన్ని ప్రకటించగలదు. కానీ చరిత్రను రద్దు చేయలేదు. ఎందుకంటే అసమానత అనేది కేవలం వర్తమాన సమస్య కాదు, వర్తమానంపై గతం చూపే ప్రభావం. అందుకే శతాబ్దాలుగా అవకాశాలకు దూరమైన వర్గాలకు ఇప్పటినుంచి అందరూ సమానం అని చెప్పడం న్యాయం కాదని వారు అర్థం చేసుకున్నారు.
అందుకే సమానత్వాన్నీ కేవలం హక్కుల భాషలోనే కాదు అవకాశాల భాషలో కూడా నిర్వచించారు. రిజర్వేషన్లు ఆ తర్కం నుంచే పుట్టాయి. అవి ప్రత్యేక హక్కులు కాదు. చరిత్ర మూసివేసిన తలుపులను ప్రజాస్వామ్యం మళ్లీ తిరిగి రాయడానికి నిర్మించిన రాజ్యాంగబద్ధ వంతెన. ప్రపంచ ప్రజాస్వామ్యాల అనుభవం కూడా ఇదే చెబుతుంది. అమెరికా బానిసత్వం తర్వాత, దక్షిణాఫ్రికా అపార్థెయిడ్ తర్వాత, బ్రెజిల్ వర్ణ అసమానతల నేపథ్యంలో, కెనడా స్థానిక ప్రజల హక్కుల విషయంలో, న్యూజిలాండ్ మావోరీ ప్రజల రాజకీయ ప్రాతినిధ్యంలో. రూపాలు,పేర్లు వేరు కావచ్చు. కానీ ప్రతి సమాజం ఒకే సత్యాన్ని ఎదుర్కొంది. చరిత్ర సృష్టించిన అసమానతులను మార్కెట్ స్వయంగా సరిచేయదు. పోటీ కూడా సరి చేయదు. అందరికీ సమాన అవకాశం అనే నినాదం ఒకటే వాటిని తొలగించదు. ప్రజాస్వామ్యం కొన్నిసార్లు చరిత్రతో వాదించాల్సి వస్తుంది. ప్రత్యేక అవకాశాల విధానాలు ఆ వాదనలో భాగం. అవి సమానత్వానికి మినహాయింపులు కాదు. సమానత్వాన్ని వాస్తవం చేయటానికి ఉపయోగపడే మార్గాలు. రిజర్వేషన్లపై ప్రతి చర్చలో ‘మెరిట్’ అనే పదం తప్పనిసరిగా వినిపిస్తుంది. కానీ మెరిట్ అనేది అవకాశాల నుంచి వేరు చేసుకోగలిగే గుణం అయితే సమాజం ఎప్పుడో న్యాయబద్ధమై ఉండేది.
నిజానికి మెరిట్ కూడా ఒక సామాజిక నిర్మాణమే. ఒక పిల్లవాడు ఏ పాఠశాలలో చదివాడు, ఇంట్లో చదివే గది ఉందా, తల్లిదండ్రుల విద్యా స్థాయి ఏంటి, అతను ఆకలితో పాఠశాలకు వెళ్లాడా లేక ఆత్మవిశ్వాసంతో వెళ్ళాడా, కులం కారణంగా అవమానాన్ని ఎదుర్కొన్నాడా లేదా ఇవన్నీ అతని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ప్రతిభను మాత్రమే చూసి మెరిట్‌ను కొలవడం అంటే అవకాశాలను కనిపించినట్లు నటించడం; అసమాన ప్రారంభ రేఖలతో పందెం పెట్టి గెలిచిన వారిని ప్రతిభావంతులని ప్రకటించినట్టే. ప్రపంచానికి మరో నైతిక కొలమానం ప్రాతినిధ్యం; ప్రాతినిధ్యం రాజకీయ నినాదం కాదు. ప్రజాస్వామ్య నైతికత. న్యాయస్థానాల్లో, విశ్వవిద్యాలయాల్లో, శాసనసభల్లో, పరిపాలన వ్యవస్థలో, సమాజంలోని అన్నివర్గాలు కనిపించాలి. ఎందుకంటే రాష్ట్రం కేవలం అధికారం నిర్మాణం కాదు. సమాజం తననుతాను చూసుకునే అద్దం. ఆ అద్దంలో కొన్ని వర్గాలు మాత్రమే కనిపిస్తే మిగిలినవారికి ప్రజాస్వామ్యం ఒక వాగ్దానంగా మిగులుతుంది. అనుభవంగా మారదు. అందుకే ప్రాతినిధ్యం అనేది రాజకీయ రాయితీకాదు. ప్రజాస్వామ్య నాణ్యతకు అవసరమైన షరతు. అయితే రిజర్వేషన్ల గురించి ఏ నిర్ణయానికైనా రాకముందు ఆ షరతు నిజంగా నెరవేరిందా అనే కనీస ప్రాథమిక ప్రశ్నలనైనా మనకు మనమే వేసుకోవాలి. అది కులం మనిషి అవకాశాలను, ఆత్మగౌరవాన్ని, జీవిత గమనాన్ని, ఏమాత్రం ప్రభావితం చేయడం లేదని ధైర్యంగా ప్రకటించగలమా? పుట్టుక కాదు ప్రతిభ మాత్రమే ప్రతి వ్యక్తి భవిష్యత్తును నిర్ణయిస్తుందని నిస్సందేహంగా చెప్పగలమా? మొత్తానికి సామాజిక న్యాయం పూర్తయిందని నిజంగా చెప్పగలమా? ఈ ప్రశ్నలు దీనికైనా నిజాయితీగా ‘అవును’ అని చెప్పగలిగితేనే రిజర్వేషన్ల అవసరం ముగిసింది అని చెప్పవచ్చు. లేకపోతే సమస్య ఇంకా కొనసాగుతుండగానే పరిష్కారం పూర్తయిందని ప్రకటించినట్లు అవుతుంది. ఇలాంటి సమయంలోనే రిజర్వేషన్లపై చర్చ మళ్ళీ రాజకీయ కేంద్రంగా మారడం గమనించదగిన విషయం.
రిజర్వేషన్లపట్ల విముఖతను వ్యక్తం చేస్తూ వచ్చిన బిజెపి రాజకీయ సైద్ధాంతిక వైఖరి నేపథ్యంలో ఈ చర్చను విశ్లేషించడం సహజమే. అయితే రాజకీయ ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ సమాజం అడగాల్సిన ప్రశ్న మాత్రం వేరే. ‘రిజర్వేషన్ల స్థానంలో సామాజిక న్యాయాన్ని మరింత సమర్థ్ధంగా సాధించే వ్యవస్థ ఏమిటి’? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు స్పష్టంగా వినిపించలేదు. ఎందుకంటే ప్రత్యామ్నయం అనేది ఒక నినాదం కాదు. ఒక సామాజిక నిర్మాణం. కులం అవకాశాలను నిర్ణయించనీ సమాజం. అందరికీ సమాన నాణ్యతతో కూడిన విద్య. భూమి వంటి ఉత్పాదక వనరులపై న్యాయమైన ప్రాప్యత. వివక్ష లేని ఉపాధి. సంపదలో తీవ్రమైన అసమానతలు తగ్గిన ఆర్థిక వ్యవస్థ. అన్ని వర్గాలకు సహజమైన ప్రాతినిధ్యం. ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే రిజర్వేషన్లు అవసరం సహజంగానే తగ్గుతుంది. కానీ ఈ పరిస్థితులను సృష్టించకుండా రిజర్వేషన్లను మాత్రమే తొలగించడం అంటే వ్యాధిని అలాగే ఉంచి మందులు తీసేయడమే. అందుకే భారత ప్రజాస్వామ్యం ముందున్న అసలు సవాలు రిజర్వేషన్లను సమర్ధించాలా, వ్యతిరేకించాలా అనేది కాదు. సమానత్వాన్ని నిరంతరం వాయిదా వేస్తున్న సామాజిక నిర్మాణాన్ని మార్చగలదా లేదా అనేదే. రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయం రిజర్వేషన్లను రద్దు చేయడం కాదు. వాటి అవసరాన్ని అనవసరం చేసే వ్యవస్థను నిర్మించడం. కానీ ఆ సమాజాన్ని నిర్మించే దిశగా మనం నిజంగా ప్రయాణిస్తున్నామా? లేక రిజర్వేషన్లనే ప్రశ్నిస్తూ వాటిని అనివార్యం చేసిన సామాజిక నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నామా? భారత ప్రజాస్వామ్యం చివరికి సమాధానం చెప్పాల్సింది ఈ ప్రశ్నకే.
ఆయిరబోయిన బిక్షపతి, 79932 48717











