
న్యూఢిల్లీ: భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ 38 ఏళ్ల రహానే తన రిటైర్మెంట్ ను అధికారికంగా వెల్లడించారు. భారత జట్టుతో గడిపిన సమయాన్ని, దేశం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన విధానాన్ని వివరిస్తూ రహానే భావోద్వేగానికి లోనయ్యారు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించిన రహానే.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయంతో భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తన కెరీర్‌లో ముందుకు సాగడానికి ఇదే సరైన సమయమని రహానే పేర్కొన్నారు. ఆటగాడిగా కెరీర్‌కు ముగింపు పలుకుతున్నప్పటికీ, ఈ క్రీడతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వీడియో సందేశంలో.. "ప్రతిదానికీ ఒక ఆరంభం, ఒక ముగింపు ఉండటం జీవిత వాస్తవం. సరైన సమయం వచ్చినప్పుడు, దానిని గౌరవించి ముందుకు సాగాల్సిందే. నా బ్యాటింగ్‌లో నేను ఎప్పుడూ 'టైమింగ్' (సరైన సమయం) పైనే ఆధారపడ్డాను. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్, అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని నాకు అనిపిస్తోంది. చిన్నతనంలో ప్రాక్టీస్ కోసం డోంబివ్లీ నుంచి ప్రయాణించిన రోజుల నుంచి, ఈ ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను" అని రహానే పేర్కొన్నారు.
క్రికెట్ కెరీర్..
కాగా, 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం భారత టెస్టు జట్టులోకి అడుగుపెట్టిన రహానే, ఆ తర్వాత కొద్ది కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. టెస్ట్ జట్టులో కీలకమైన మిడిల్-ఆర్డర్ బ్యాటర్‌గా మారాడు. ముఖ్యంగా విదేశీ పరిస్థితుల్లో అద్భుతంగా రాణించి, తన 12 టెస్ట్ సెంచరీలలో ఎనిమిదింటిని స్వదేశం వెలుపలే సాధించాడు. భారత జట్టులో అత్యంత దృఢచిత్తం కలిగిన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రహానే, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినప్పుడల్లా తన వంతు కృషిని అందించారు. తన కెరీర్‌లో మొత్తం 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఈ 195 మ్యాచ్‌లలో రహానే మొత్తం 8,414 పరుగులు చేశారు. ఇందులో 5,077 పరుగులు టెస్టు క్రికెట్‌లో సాధించినవే. అలాగే, రహానే ఆరు వేర్వేరు ఫ్రాంచైజీల తరపున 212 ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడారు.











