
న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ‘రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్’గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయం సమీపంలోనూ, సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారంనాడు పోస్టర్లు కనిపించాయి. ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీ చిత్రంతో పాటు బ్యాట్‌మ్యాన్ చిత్రాన్ని ఉంచారు.
వీటిపై ‘నిశ్శబ్ద సంరక్షకుడు’ (ది సైలెంట్ గార్డియన్), ‘అప్రమత్తమైన రక్షకుడు’ (అప్రమత్తమైన రక్షకుడు) అనే వ్యాఖ్యలు ఉన్నాయి. మరో క్యాప్షన్‌లో ‘లోసభభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ-నిజ జీవిత బ్యాట్‌మ్యాన్’ అని పేర్కొన్నారు. ఢిల్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అక్షయ్ లక్రా సౌజన్యంతో ఈ పోస్టర్లను కోట్లా రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ప్రవేశద్వారం సమీపంలోనూ, రైసినా రోడ్డులోని ఇండియన్ యూత్ కాంగ్రెస కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు.
కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషనలో ‘మీరు బ్యాట్‌మ్యానా?’ అనే ప్రశ్నకు చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ‘నేనూ, బ్యాట్‌మ్యాన్ ఒకే గదిలో ఉన్నట్టు ఇప్పటివరకూ చూడలేదని మాత్రమే చెప్పుకుందాం’ అంటూ ఆయన నవ్వులు చిందించారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్’ అంటూ రాహుల్ పోస్టర్లు వెలవడం ఆసక్తికరంగా మారింది.











