
మన తెలంగాణ/కొత్తగూడ: టాయిలెట్లు, మంచినీటి సమస్యలపై స్పందించకుండా, మరమ్మతుల కోసం డబ్బులు అడిగినట్లు ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన అధికారులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కల్పనపై సస్పెన్షన్ వేటు వేశారు. టాయిలెట్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరైనప్పటికీ, ఇప్పటివరకు పనులు చేపట్టకుండా కాలయాపన చేయడం సరైనది కాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మంత్రి సీతక్క విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే టాయిలెట్ల మరమ్మతులు ప్రారంభించారు. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా మరమ్మతుల్లో ఎందుకు జాప్యం జరిగిందని మంత్రి సీతక్క ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గురుకులంలో పీఎంశ్రీ నిధులు, అడ్మిషన్ల వ్యవహారాలపై లోతైన విచారణ జరిపించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.











