
ఇబ్రహీంపట్నం ఎఓ శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఎసిబి సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల గుర్తింపు
వాటి విలువ రూ. 100కోట్లకు పైనే ఉన్నట్లు నిర్ధారణ
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ హస్తినాపురంలోని ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. సుమారు 15 ఏసీబీ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు సమాచారం.
సోదాల్లో శ్రీనివాస్‌రెడ్డికి కర్మన్‌ఘాట్‌లో రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, జీ+3 పెంట్‌హౌస్, యాచారం మండలం నల్లవెళ్లిలో సుమారు 10 ఎకరాల 8 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సిటీ, శివారు ప్రాంతాల్లో సుమారు ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, బాలాపూర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో వాటా ఉన్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో తహశీల్దార్‌గా పనిచేసినట్లు తెలిసింది. ఆస్తుల విలువ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.











