మన తెలంగాణ/హైదరాబాద్ : గోల్డ్ స్కామ్ కేసులో టాలీవుడ్ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఐదు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే రూ.2.21 కోట్ల గోల్ స్కామ్ కేసులో ’లఫూట్ గ్యాంగ్’ నిర్మాత కే.లక్ష్మీకాంత్ రెడ్డిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాంపల్లి 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

బాధితుడు రాకేష్ బలరాం గౌడ్ తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి, విడతల వారీగా రూ.2.21 కోట్లు తీసుకుని, బంగారం ఇవ్వకుండా, డబ్బు తిరిగి చెల్లించకుండా మో సం చేసినట్లు కంప్లైంట్‌లో ఆరోపించారు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే... తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు.

సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తగిన చర్యలు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించ గా రూ.2.21 కోట్లు కావడంతో దర్యాప్తును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు అనంతరం సిసిఎస్, హైదరాబాద్‌కు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. అతనిపై ఇప్పటికే మరో నాలుగు క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. మహంకాళి పిఎస్, రాయదుర్గం, కోయిల్‌కొండ, పెందుర్తి, హైదరాబాద్ సిసిఎస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.