ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ ఏదో ఒక ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సీట్ల కోసం ప్రయాణికుల మధ్య జరిగే చిన్న చిన్న వాగ్వాదాల నుంచి సరదా మీమ్స్ వరకు ఎన్నో ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా అలాంటి మరో ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్ల వద్ద "స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం" అనే సందేశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోలో అదే బోర్డును మార్చి "పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం" అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ ఫొటో సూర్యాపేట రూట్‌లో నడిచే ఓ TGSRTC బస్సులో తీసినదేనని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు షేర్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా TGSRTC ఎలాంటి ధృవీకరణ లేదా ప్రకటన విడుదల చేయలేదు. నిజంగా బస్సులో ఉన్న బోర్డేనా? లేక ఎడిట్ చేసిన చిత్రమా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

అయితే ఫొటో మాత్రం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. "ఇన్నాళ్లకు మాకు కూడా గౌరవం దక్కింది", "ఇక బస్సులో మాకూ సీటు దొరుకుతుందేమో", "ఈ బోర్డు నిజమైతే బాగుంటుంది", "కనీసం ఇది చూసైనా సీటు ఇస్తారేమో" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో సీట్ల కోసం పోటీ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణ అనుభవాలపై మీమ్స్, ట్రోల్స్, ఫన్నీ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న "పురుషులను గౌరవించడం మన సంప్రదాయం" బోర్డు కూడా అదే కోవలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది అధికారిక బోర్డా? లేక సోషల్ మీడియా కోసం రూపొందించిన క్రియేటివ్ పోస్టా? అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.