ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరించడంలో అధికారుల నిర్లక్షం

అత్యవసరంగా చర్య తీసుకోండి

ఎన్నికల సంఘానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ విజ్ఞప్తి

మన తెలంగాణ / హైదరాబాద్ : సర్ ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణకు సోమవారంతో గడువు ముగుస్తుండగా సెలవుల పేరుతో జిహెచ్‌ఎంసి పరిధిలోని బిఎల్‌ఓలు ఫారాలు తీసుకోవడం లేదంటూ పలు ఫిర్యాదులు వచ్చాయని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ఎన్నికల సంఘం, జిహెచ్‌ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత 24 గంటలుగా తమ సర్ గైడెన్స్ డెస్క్‌కు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, బిఎల్‌ఓలు 9న బోనాలు, 10న రంగం పబ్లిక్ హాలిడే అంటూ ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని, దీంతో చాలా మంది మా డెస్క్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఓవైసీ తెలిపారు.

ఈసి నిబంధనల ప్రకారం ప్రజలకు ఆగష్టు 10 వరకు సమయం ఉందని, కాని ఆ రోజే బిఎల్‌ఓలు పని చేయడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. దీనిపై అత్యవసరంగా చర్య తీసుకోవాలని‘ కోరారు. అధికారులు వెంటనే స్పందించి, చివరి తేదీ వరకు ఫారాల స్వీకరణ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.