
రాష్ట్రంలో ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంటర్ బైపిసి విద్యార్థులకు ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలయ్యింది. రెండు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 15 నుంచి 17 వరకు మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనునున్నట్లు ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వచ్చే నెల 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 21వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 21,22 తేదీలలో ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25 నుంచి మొదలవుతుంది. వచ్చే నెల 25న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 26,27 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 29న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసి, అక్టోబర్ 1వ తేదీ లోగా కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 2వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.








