నూనూగు మీసాల కెటిఆర్ కొడుకుకి 40 ఎక‌రాల భూమి ఎలా వ‌చ్చింది.

అసైన్డ్ భూముల పట్టాదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టం

కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూములపై సర్వే అనంతరం వాస్తవాలు వెల్లడిస్తాం

రంగనాయకసాగర్ భూముల వ్యవహారంపైనా రికార్డుల ఆధారంగా విచారణ

తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం చర్యలు.. అధికారుల పొరపాట్లకు కూడా మినహాయింపు లేదు

కేటీఆర్ చెప్పిన‌ట్లుగా కేసీఆర్‌కు చిన్న‌ప్పుడే 2ఎక‌రాల‌లో ఇల్లుంటే ఎందుకు 2004 అఫిడ‌విట్‌లో చేర్చ‌లేదు.

మీడియా చిట్‌చాట్ లో రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో భూములపై నెలకొన్న వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలంటే రికార్డులు, భౌతిక పరిస్థితి రెండింటినీ సమన్వయం చేయాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రికార్డులో ఉన్న భూమి ఎంత? డాక్యుమెంట్లలో ఎంత? భౌతికంగా ఎవరి పొజిషన్‌లో ఎంత ఉంది? ప్రభుత్వ భూమి ఎంత? అసైన్డ్ భూమి ఎంత? అన్నది సమగ్ర సర్వే ద్వారా తేలుస్తాం. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , తాను మాట్లాడే ప్రతి అంశానికి డాక్యుమెంట్లు, అధికారిక రికార్డులు ఉన్నాయని, సర్వే పూర్తయిన తర్వాత సాంకేతిక ఆధారాలతో వాస్తవాలు బయటకు వస్తాయ‌ని తెలిపారు. భూముల విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టదని, అయితే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రైవేట్ పట్టా భూములు, భౌతిక స్వాధీనం, రెవెన్యూ రికార్డులు, ఎన్నికల అఫిడవిట్లలో చూపిన ఆస్తుల మధ్య తేడాలు ఉంటే వాటిని రికార్డుల ఆధారంగా పరిశీలించాల్సిందేనని అన్నారు

కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూములపై సమగ్ర సర్వే

కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో ఉన్న భూముల విషయంలో స్థానికుల నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన కూడా స్థానికుల నుంచి వచ్చిన సమాచారంపై ఆధారపడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల్లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు సర్వేలో తేలితే, చట్టప్రకారం ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అర్హులైన పేదలకు, ముఖ్యంగా దళితులకు ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2004 అఫిడవిట్‌లో భూములు లేవని చెప్పి.. ఇప్పుడు వందల ఎకరాలు ఎలా? అని ప్ర‌శ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ భూములపై జరుగుతున్న చర్చలో ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన వివరాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

2004 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో కెసిఆర్ తన పేరున వ్యవసాయ భూమి లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు తర్వాత కాలంలో విస్తారమైన భూములు ఎలా వచ్చాయి? పుట్టుకతోనే వందల ఎకరాల భూస్వాములమని చెబుతున్నప్పుడు, ఆ భూముల వివరాలు సంబంధిత ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు కనిపించలేదు? అని మంత్రి ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రస్తుత వాదనలు, అప్పటి అఫిడవిట్ల వివరాల మధ్య ఉన్న తేడాలను రికార్డుల ఆధారంగా పరిశీలించాల్సి ఉందన్నారు. కెటిఆర్ కొడుకు పేరిట 40 ఎక‌రాల భూమిపై స్పందిస్తూ నూనూగు మీసాల పిల్లోడు ఏ వ్యాపారం చేశాడ‌ని ఇంత భూమి వ‌చ్చింద‌ని మంత్రి ప్ర‌శ్నించారు.

హరీశ్‌రావు అఫిడవిట్‌పైనా ప్రశ్నలు

హరీశ్‌రావు తన ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన భూములు, ప్రస్తుతం ఉన్న భూములు, భౌతిక స్వాధీనం, ట్రస్ట్ పేర్లతో ఉన్న భూములు తదితర అంశాలను కూడా పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. అఫిడవిట్‌లో ఎంత చూపించారు? రికార్డుల్లో ఎంత ఉంది? భౌతికంగా ఎంత ఉంది? బినామీ పేర్లలో ఏమైనా ఉందా? అన్నది అధికారిక రికార్డుల ఆధారంగా తేలాల‌ని అన్నారు. అఫిడవిట్‌లో చూపిన విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి ఉన్నట్లు తేలితే దాని చట్టబద్ధతను పరిశీలిస్తామని చెప్పారు. ఒక గుంట తేడా ఉన్నా అది ఎవరి పేరున, ఏ హక్కుతో ఉందో రికార్డుల ద్వారా తేలాల‌ని అన్నారు.

హరీశ్‌రావు కుటుంబ సభ్యులు మాజీ సైనికుడి నుంచి భూములు కొనుగోలు చేశారన్న వాదనపై కూడా మంత్రి స్పందించారు. భూమి లావాదేవీ జరిగితే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, పట్టా, ఇతర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉండాలి. ఆ డాక్యుమెంట్లు, వాటి వెనుక ఉన్న రికార్డులు ఏమిటో పరిశీలిస్తాం” అని తెలిపారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు, మాజీ సైనికుల పేర్లతో జరిగిన భూ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కూడా అధికారికంగా పరిశీలిస్తామని చెప్పారు. ఏదైనా పత్రం తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్లు తేలితే, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిద్ధిపేట ప్రాంతంలో భూ అక్ర‌మాల‌ను వెలికి తీసి అక్క‌డ ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తామ‌ని వివరించారు.

రైతుల‌కు అండ‌గా ప్ర‌జాప్ర‌భుత్వం

అసైన్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని మంత్రి తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములపై ఒరిజినల్ పట్టాలు ఉన్నవారిని ఇబ్బంది పెట్టబోమని స్పష్టం చేశారు. పట్టాలు కలిగిన అసైన్డ్ భూములను లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ముందుగా అసైన్డ్ భూముల పూర్తి వివరాలను తేల్చి, ఆ తర్వాత పక్కనే ఉన్న భూములపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రంగనాయకసాగర్ భూముల వ్యవహారంపై రికార్డుల పరిశీలన

రంగనాయకసాగర్ పరిసర భూముల విషయంలో అప్పటి ఇరిగేషన్ శాఖ రికార్డులు, ఎఫ్‌టిఎల్ , బఫర్ జోన్, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాల్సి ఉందని మంత్రి తెలిపారు.అప్పటి పరిస్థితుల్లో సంబంధిత భూములపై శాఖల మధ్య జరిగిన లేఖాచారాలు, భూముల వర్గీకరణలో మార్పులు, రిజిస్ట్రేషన్ జరిగిన విధానం, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వినియోగించారా లేదా వంటి అంశాలపై పూర్తి వివరాలు సేకరిస్తామని చెప్పారు.ఇరిగేషన్ శాఖ ఎంత భూమి అవసరమని కోరింది? తర్వాత ఆ భూమి రికార్డుల్లో ఏ మార్పులు జరిగాయి? ఎంత మొత్తానికి రిజిస్ట్రేషన్ జరిగింది? అన్నది డాక్యుమెంట్ల ద్వారా తేలాల‌ని మంత్రి అన్నారు.

వట్టినాగులపల్లి భూమిపై వివరణ

'వట్టినాగులపల్లి భూమికి తనకు ప్రత్యక్ష యాజమాన్య సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆ భూమి నాది కాదు. డెవలప్‌మెంట్ కోసం తీసుకున్నాం. నేను రాజకీయాల్లోకి రాకముందే వ్యాపార రంగంలో ఉన్నాను. నా ప్రాజెక్టులకు అనుమతులు గత ప్రభుత్వాల సమయంలోనే వచ్చాయి. అదే ప్రభుత్వాలు వాటిని నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. నేను మంత్రి అయిన తర్వాత తన కుమారుడు వ్యాపారంలోకి రాలేదని, కుటుంబ సభ్యులను రాజకీయ వివాదాల్లోకి లాగడం సరైంది కాదని మంత్రి అన్నారు. “నా కుటుంబం అయినా, వారి కుటుంబం అయినా కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగకుండా అసలు భూ రికార్డులు, డాక్యుమెంట్లపైనే చర్చ జరగాల‌ని అన్నారు. భూముల వ్యవహారంలో వ్యక్తి, పార్టీ, పదవి అనే తేడా ఉండదని మంత్రి స్పష్టం చేశారు.నేను తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. ముఖ్యమంత్రి గారు, నేను బేస్‌లెస్‌గా మాట్లాడటం లేదు. ప్రతి అంశానికి డాక్యుమెంట్ ఉంది. సర్వే, రికార్డుల పరిశీలన పూర్తయిన తర్వాత వాస్తవాలు స్పష్టంగా బయటపడతాయి” అని తెలిపారు. అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ఇబ్బంది పెట్టబోమని, అయితే ప్రభుత్వ భూముల విషయంలో చట్టపరమైన బాధ్యత నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.