జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడాకులపై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కీలక తీర్పు ప్రకటించింది. 17 ఏళ్లుగా భార్య పాయల్ తో దూరంగా ఉంటున్న ఆయన వైవాహిక జీవితానికి ముగింపునిచ్చింది. కొన్నేళ్లుగా ఒమర్, పాయల్ పరస్పరం కేసులు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు.ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లాకూ, ఆయన భార్య పాయల్‌లకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తాజాగా ప్రకటించింది. తమ వివాహ బంధాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకుని,

పెండింగ్‌లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి అంగీకరించినట్లు ఇరువురూ కోర్టుకు చెప్పినట్లు కోర్టు వెల్లడించింది. గతంలో తమ వివాహాన్ని రద్దు చేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంలో విచారణ సందర్భంగా ఒమర్, పాయల్ పరస్పర అంగీకారంతో తమ పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సంయుక్తంగా దరఖాస్తు దాఖలు చేశారు. అలాగే పరస్పరం దాఖలు చేసుకున్న అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా అంగీకరించారు.