వయనాడు: నీట్ పరీక్షల్లో అవకతవకలపై గళం విప్పిన విద్యార్థులపై పోలీసుల దమనకాండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పోలీసుల అమానుషకాండకు బాధితులైన విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పడానికి బదులు సిల్లీ వీడియోలు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వీధుల్లోకి రావడానికి ఆయనే బాధ్యులని, విద్యార్థులపై టెర్రరిస్టుల తరహాలో పెల్లెట్ గన్‌లు ప్రయోగించడానికి కూడా ఆయనే బాధ్యులని అన్నారు. దీనిపై దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంటుకు హాజరై విద్యార్థులు అడుగుతున్న మార్పులు చేపట్టాలన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, విద్యార్థుల భవిష్యత్తు చెల్లాచెదురైందని చెప్పారు. పరీక్ష రాయాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నపత్రం లీక్ అయితే కొందరు ధనవంతుల పిల్లలు 30 నుంచి 40 లక్షలలకు కొనుక్కుంటారని, తక్కిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆమె నిలదీశారు. ఈ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన వారికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రధానిపైనే ఉందన్నారు. కఠినమైన చట్టాలు ఉన్నందున ఎవరూ ఆందోళన పడవద్దని ప్రభుత్వం చెబుతోందని, ఇదెలాంటి కఠిన చట్టమని ప్రశ్నించారు.

నాలుగేళ్ల క్రితం ఇదే బిల్లు ప్రవేశపెట్టి, కొద్దిపాటి శిక్ష పెంచారని, అందువల్ల ఒరిగేందేమీ లేదని చెప్పారు. ప్రశ్నపత్రాల లీక్‌కు సంబంధిత మంత్రి బాధ్యుడైనప్పుడు అతన్ని వెంటనే తొలగించడమే నాయకత్వం అవుతుందన్నారు. అలాంటి నాయకత్వం ప్రధానికి లేదన్నారు. ఈ దేశం యువతదని, నరేంద్ర మోదీది కాదని ఘాటుగా విమర్శించారు. పార్లమెంటు సైతం మోదీది కాదని, దేశ ప్రజలదని, దేశప్రజలు మాట్లాడతారని, వాటిని వినాల్సిన బాధ్యత మాత్రమే ప్రధానిదని అన్నారు.