నేడు జింబాబ్వేతో రెండో టి20

హరారే: జింబాబ్వేతో శనివారం జరిగే రెండో టి20 సమరానికి టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి సిరీస్ పట్టేయాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. అయితే కిందటి మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలం కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా అభిషేక్ తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు.

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్‌లో విధ్వంసక హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్దమయ్యాడు. వైభవ్ చెలరేగితే టీమిండియాకు ఎదురే ఉండదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబె తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, బిష్ణోయ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు జింబాబ్వేకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్‌లో నిలవాంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ ఓడితే సిరీస్ కోల్పోక తప్పదు.