ది హండ్రెడ్ మెన్స్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మంగళవారం హెడింగ్లే వేదికగా లండన్ స్పిరిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 బంతుల్లోనే 241 పరుగులు చేశారు. దీంతో సన్‌రైజర్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ర్యాన్ రికెల్టన్ శుభారంభం అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 54 బంతుల్లోనే 131 పరుగులు జత చేశారు. పురుషుల హండ్రెడ్ లీగ్2లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మార్ష్ 24 బంతుల్లో అర్థశతకం సాధించగా.. రికెల్టన్ కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే మార్ష్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో 76 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ, రికెల్టన్ మాత్రం దూకుడుగా ఆడాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 100 బంతులలో 2 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.

అయితే లండన్ స్పిరిట్‌కి లక్ష్య చేధనలో ఆరంభంలోనే షాక్ తగిలింది. జానీ బెయిర్‌స్టో(0), లువాన్-డ్రె-ప్రిటోరియస్(5) త్వరగా పెవిలియన్ చేరారు. లియామ్ లివింగ్‌స్టోన్ (13 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డేవిడ్ విల్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓవర్టన్ 15 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లండన్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 204 పరిమితమైంది.