సొంత చెల్లి, బావ ఫోన్లు కూడా ట్యాప్ చేసిన కెటిఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ వేదికగా ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని ఇందిరమ్మ పాలన అంటే ఏమిటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుంది కెటిఆర్ అంటూ మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ఫాంహౌస్‌లో ఉంటే ఏం తెలుస్తుంది? జూన్ 1వ తేదీన మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని, హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నామని మే 23వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని మంత్రి పొంగులేటి ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న డ్రామారావు అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా మిమ్మల్ని ఓడగొట్టిన ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మీరు ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోనక్కర్లేదని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు లేని గ్రామాల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఓట్లు అడగకూడదన్న ఈ సవాల్‌కు సిద్ధమేనా కెటిఆర్ అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.