
మన తెలంగాణ, వికారాబాద్ బ్యూరో, దౌల్తాబాద్: కాంగ్రెస్‌కు ఓట్లేసిన వారిని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీన్ని తిప్పి కొంటాలంటే నమోదైన ఓట్లను తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై నియోజకవర్గ బూతు స్థాయి ఏజెంట్లతో పరిగి, తాండూర్ శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డిలతో కలిసి సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ నమోదులో అధికారులు కోరిన పత్రాలు అందజేసి.. ఓటరు జాబితాలో ఓటు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఓటు హక్కు లేకపోతే చనిపోయిన వారితో సమానమని అన్నారు. ఓటరు జాబితాలో ఓటు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు బంద్ అవుతాయని స్పష్టం చేశారు. తాను రోజుకు 18 గంటలు పనిచేసినా.. సమయం సరిపోవడంలేదని, పాలనలో బిజీగా ఉంటే నన్ను దెబ్బ తీయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాల్సిన బాధ్యత బూతు స్థాయి ఏజెంట్లదేనన్నారు. ఎస్‌ఐర్ ప్రక్రియను చేపట్టేందుకు ఆగస్టు 3వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం గడువును పొడిగించిందన్నారు.
తాండూరు ఎమ్మల్యే మనోహర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొన్ని రోజులు ఆపేసి సర్ ప్రక్రియ పని చూడాలని కోరారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పనితీరు బాగుందని కొనియాడారు. కొడంగల్ నియోజకవర్గంలో 78 శాతం సర్ ప్రక్షాళన జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2,51,255 ఓటర్లకుగాను 1,96,620 ఓటర్ల నమోదు అయ్యాయని.. మిగతా 54,635 ఓట్ల నమోదు చేయాల్సి ఉందని, బీఎల్‌ఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వలస వెళ్లిన కుటుంబాలను గుర్తించి ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేనట్లయితే సంక్షేమ ఫలాలు కోల్పోతారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ఓటర్లుగా నమోదు అయ్యేలా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల ఓట్లు తప్పిపోకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో కొడంగల్, నారాయణపేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రాజేష్‌రెడ్డి, విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్లు నందారం ప్రశాంత్, నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.











