
మంత్రి కొండా సురేఖ మాజీ ఒఎస్‌డి సుమంత్‌ను అరెస్ట్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, చెక్‌పోస్ట్ సమీపంలోని ఒక డెన్‌లో కొండా సురేఖ మాజీ ఒఎస్‌డి సుమంత్ తన అనుచరులతో కలిసి బాధితుడు హరికృష్ణపై రాడ్లతో దారుణంగా దాడి చేశారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే, దాదాపు 20 రోజుల పాటు కేసు నమోదు కాకుండా అడ్డుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వెనుక సిఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని తీవ్ర ఆరోపనలు చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో దాడి జరిగితే సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో కేసు నమోదు కావడం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని వ్యాఖ్యానించారు.కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసేంత వరకు
సుమంత్‌పై కేసు నమోదు కాకుండా తొక్కిపెట్టారని పేర్కొన్నారు. కేసు నమోదైనా ఇప్పటి వరకు సుమంత్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. పైగా కేవలం మూడు వారాల క్రితమే బాధ్యతలు స్వీకరించిన జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌ను ఈ వ్యవహారంలో బలిపశువును చేస్తూ అకారణంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎసిపి వెంకట్ రెడ్డిపై, డిసిపిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. డిజిపి కిందస్థాయి పోలీసులను కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారని అన్నారు. తాము గట్టిగా అడిగితే బిఆర్‌ఎస్ నాయకుల గన్ మెన్‌లను తీసివేస్తున్నారని, మరి జానా రెడ్డికి ఎందుకు ఇచ్చారని అడిగారు. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. తమ నేత జోగు రామన్నకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాజకీయ చదరంగంలో పోలీస్ అధికారులను బలిచేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వీటి అన్నింటిపై చర్చ జరగాలి అంటే సిట్ వేయాలని పేర్కొన్నారు.











