సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను ప్రస్తుతమున్న 34 నుంచి 37కు పెంచుతూ రూపొందించిన సుప్రీంకోర్ట్ (జడ్జీల సంఖ్య) సవరణ బిల్లు-2026కు రాజ్యసభ బుధవారంనాడు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఆగస్టు 3న లోక్‌సభ ఆమోదించిన ఆర్డినెన్స్ స్థానే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా, లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఉభయసభల్లోనూ బిల్లు ఆమోదానికి నోచుకుంది. బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 1950లో సుప్రీంకోర్టు పనిచేయడం మొదలైనప్పుడు సీజేఐతో సహా ఎనిమిది మంది జడ్జిలు ఉండేవారని, పెరుగుతున్న పనిభారానికి తగ్గట్టుగా

ఎప్పటికిప్పుడు జడ్జీల సంఖ్యను పెరుగుతోందన్నారు. ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరుగుతుండటం, పరిష్కారంలో జరుగుతున్న జాప్యం కారణంగా రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం జడ్డీల సంఖ్య పెంచుతూ కేంద్రం సవరణ తీసుకువచ్చిందని వివరించారు. అత్యున్నత న్యాయవ్యవస్థలో మహిళలకు ప్రాతినిధ్యంపై మాట్లాడుతూ, త్వరలోనే తొలి మహిళా సీజేఐను చూసే అవకాశం ఉండొచ్చని అన్నారు. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రస్తావిస్తూ, దీనిపై సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ఇంతవరకూ అంగీకరించలేదని చెప్పారు.