
ఆసిఫాబాద్: సవతిని కర్రతో కొట్టి చంపి అనంతరం పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సోనాపూర్‌లో ఆత్రం కన్ను అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య రాంబాయి(55), రెండో భార్య సాకృబాయి(60)లు ఉన్నారు. ఇద్దరు భార్యల మధ్య రోజు గొడవలు జరిగేవి. గత బుధవారం ఇద్దరు భార్యల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకొవడంతో సాకృబాయిపై రాంబాయి కర్రతో దాడి చేసింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వరంగంల్‌లోని ఎంజిఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆర్థికి స్తోమత అంతంతమాత్రంగానే ఉండడంతో ఇంటికి తీసుకొచ్చారు. శుక్రవారం ఆమె మృతి చెందింది. దీంతో తనని పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో రాంబాయి తన పొలంలోకి వెళ్లి దాక్కుంది. పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు తనకు ఎవరు ఫిర్యాదు చేయలేదని ఎస్‌ఐ మహేందర్ మీడియాకు తెలిపాడు.











