నామినేటెడ్ పదవులు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్‌లో రావడం బాధాకరమంటూ మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మైనారిటీ నాయకుడైన మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీకి పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పార్టీలో కలకలం చెలరేగింది. దీంతో కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య కలహాలు బహిర్గతమయ్యాయి.షబ్బీర్ అలీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్‌గా ఉన్నారు. షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, మరోవైపు మహిళలనూ కించపరిచేలా వ్యాఖ్యానించినందున షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.


అసలేం జరిగిందంటే..

కామారెడ్డికి చెందిన పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి, లోగడ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న షబ్బీర్ అలీకి మధ్య కొంత కాలంగా పొసగడం లేదు. రెండు వర్గాలుగా ఏర్పడి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే షబ్బీర్ అలీ పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు నిజమైన కార్యకర్తలకు రావడం లేదని, అమ్ముకునే సంస్కృతి రావడం బాధాకరమని వ్యాఖ్యానించినట్లు ఓ ఆడియో వైరల్ అయ్యింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి చెందిన ఓ ‘రెడ్డి’ ఇటీవల షబ్బీర్ అలీకి ఫోన్ చేసి, పదవుల అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. అందుకు స్పందించిన షబ్బీర్ అలీ తనకైతే తెలియదు కానీ అటువంటి సంస్కృతి రావడం బాధాకరమని వ్యాఖ్యానించినట్లు ఆడియో బహిర్గతమైంది. ఇది కుట్రపూరితంగా ఆడియో రికార్డు చేసి వైరల్ చేశారని షబ్బీర్ అలీ వర్గీయుల వాదన. తనకు తెలియదన్న వ్యాఖ్యను ‘ఎడిట్’ చేసి, పదవులు అమ్ముకునే సంస్కృతి రావడం బాధాకరమన్న వ్యాఖ్యనే వైరల్ చేశారని షబ్బీర్ అలీ వర్గీయులు బలంగా వాదిస్తున్నారు.

ఎవరీ గడ్డం ?

లోగడ బిఆర్‌ఎస్‌లో చురుగ్గా ఉన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో తమ నాయకుడు షబ్బీర్ అలీ మంతనాలు జరిపి కాంగ్రెస్‌లోకి తీసుకుని వచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాలక్రమేణా కామారెడ్డి నియోజకవర్గంలో ఇరువురి మధ్య అధిపత్య పోరు ప్రారంభమైందని తెలుస్తోంది. షబ్బీర్ అలీ ప్రతిష్టను దిగజార్చి, ఇబ్బందులకు గురి చేసేందుకే ఆడియో రికార్డు చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఏఐసిసి షోకాజ్ నోటీసు ?

ఇదిలాఉండగా కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు గడ్డం ఇందు ప్రియ నేతృత్వంలో ప్రతినిధుల బృందం గత వారం పార్టీ అధిష్టానాన్ని కలిసి మహిళలను కించపరిచేలా షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్పింగ్‌ను అందజేసినట్లు సమాచారం. దీంతో పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీని కూడా నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించి ఉండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందో షబ్బీర్ అలీని అడిగి తెలుసుకోవడానికి ’మన తెలంగాణ ప్రతినిధి’ ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.