సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీలక ప్రకటన చేశారు. తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ పేరు మీద.. ప్రతి సంవత్సరం ఎండి (డాక్టర్‌ ఆఫ్ మెడిసిన్) చేసే ఒక విద్యార్థికి ఆర్థికంగా సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. యువ డాక్టర్లను ప్రోత్సహించేందుకు ముందడుగు వేశారు. ఇంగా హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి టెండూల్కర్ ఫౌండేషన్ ఈ ఫెలోషిప్‌ను ఇవ్వనుంది. శ్రీనగర్‌లో క్లెప్ట్, క్రానియోఫేసియల్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ కోసం ఏటా ఎండి చేసే ఒకరిని ఎంపిక చేయనుంది.

‘‘నా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. మా నాన్న నాలో అంతకంటే ఎక్కువ చూశారు. నేను ఏమవ్వాలో నిర్ణయించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. స్వయంగా కనుక్కొనేందుకు అవసరమైన స్వేచ్ఛను ఇచ్చారు. నా తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థుల కోసం ఫెలోషిప్‌ను అందించనుండటం సంతోషంగా ఉంది. మా నాన్న నమ్మిన సిద్ధాంతం ఇది. విద్యే అవకాశాలను సృష్టిస్తాయని ఆయన భావించారు. అది ఇతరులకు ఉపయోగపడితే అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదు. ఉపాధ్యాయుని పాఠాలు ఒక విద్యార్థితో ప్రారంభం కావొచ్చు. కానీ, వారి ప్రభావం జీవితాలకు, ఎన్నో తరాలకు స్పూర్తినిస్తూనే ఉంటుంది’’ అని సచిన్ పొస్ట్ పెట్టారు.