హైదరాబాద్: తెలంగాణ యువతలోని ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ప్రతిష్ఠాత్మకంగా టిజి 20 లీగ్ సీజన్ 2026ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల అయ్యింది. ఈ టిజి20 లీగ్ యువతకు మరింత చేరువ చేసేందుకు హెచ్‌సిఎ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక లీగ్ కు స్టార్ హీరో విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అలాగే, టైటిల్ స్పాన్సర్ గా శ్రీనిధి యూనిర్సిటీని ప్రకటించింది. దాంతోపాటు రేపు(జూన్ 17) ట్యాంక్ బండ్ పై టిజి20 లీగ్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించనుంది.

కాగా, ఈ లీగ్ జూన్ 21 నుంచి జులై 12 వరకు జరుగనుంది. ఇందులో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. ఇక అన్ని మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.