నేడు ఇంగ్లండ్‌తో మూడో వన్డే

అండన్(లార్డ్): ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌లో సమంగా నలిచిన ఇరు జట్లకు మూడో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఎవరూ గెలుపొందినా సిరీస్ విజేతగా నిలువనున్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన మొదటి వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించిన టీమిండియా కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో పరాజయంపాలైంది. దీంతో మూడో వన్డేలో ఎలాగైనా గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలనే యోచనతో బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమష్టిగా రాణించింది. బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషించి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు.

ఇక బ్యాటింగ్‌లోనూ భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు విఫలమైనా మిగతా ఆటగాళ్లు అద్భుత బ్యాటింగ్‌తో దాని ప్రభావం జట్టుపై పడకుండా చూశారు. ఈ మ్యాచ్‌లోనైనా స్టార్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలు తమ పాత్రను సమర్థంగా పోషించక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోకోలు రాణిస్తే టీమిండియాకు ఎదురే ఉండదు. ఇక శుభ్‌మన్ గిల్ కిందటి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. శ్రేయస్ అయ్యర్ సయితం ఫామ్‌లో ఉండటం టీమిండియా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన అక్షర్ పటేల్ రెండో వన్డేలో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో రాణించాల్సి అవసరం ఎంతైనా ఉంది. యువ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. జరిగిన రెండు వన్డేల్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లో తప్పకుండా రాణించాలి. మరోవైపు ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్పిందే. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయలేం. దీంతో మ్యాచ్ ఉత్కంఠబరితంగా సాగడం ఖాయమనే చెప్పొచ్చు.

మూడో వన్డేకు సుందర్ దూరం..?

టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి కాలు కండరాలు గాయంతో ఇబ్బంది పడ్డారు. దీంతో సుందర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాతి బంతికే సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో ఔటై వనుదిరిగాడు. గాయం తీవ్రత కారణంగా సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడానికి గానీ, బౌలింగ్ చేయడానికి గానీ మైదానంలోకి రాలేదు. ఆయన స్థానంలో ప్రిన్స్ యాదవ్ ఫీల్డింగ్ చేశారు. సుందర్ దూరం కావడంతో భారత్ కేవలం ఐదుగురు బౌలర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. దీంతో నేటి మ్యాచ్‌కు ఆడతాడా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.