
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ’చ్ఛాత్రోం కీ గూంజ్’ (విద్యార్థుల గళం) పేరిట దేశమంతటా ముఖ్యంగా ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఎప్పుడు వస్తారో?, విద్యార్థుల సమస్యలు ఎప్పుడు వింటారోనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యంగ్యంగా అన్నారు. విద్యార్థులకు తానే పెద్ద దిక్కు అన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 56 ఏళ్ల ఈ స్వయం ప్రకటిత యువజన నాయకుడు రాష్ట్రానికి వచ్చి తన సొంత కాంగ్రెస్ ప్రభుత్వంలో నలిగిపోతున్న విద్యార్థుల బాధలను ఎప్పుడు వింటారు? అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల, రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇబిసి విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజులు కడితేనే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీల యజమాన్యాలు తెగేసి చెబుతుండడంతో వేలాది మంది విద్యార్థులు పైచదువులకి వెళ్లలేక, ఉద్యోగాల్లో చేరలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సంగతి రాహుల్ గాంధీకి తెలియదా? లేక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలు ఆయనకు పట్టవా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలపై రాష్ట్ర హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు.
2020-21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులు రావాల్సి ఉందని, ఆ బకాయిలు దాదాపు రూ. 10,000 కోట్ల నుంచి రూ. 12,000 కోట్ల వరకు ఉన్నాయని కళాశాలల యజమాన్యాలు కోర్టుకు చెప్పాయని ఆయన తెలిపారు. దీనివల్ల పరిస్థితి చాలా ఘోరంగా తయారైందని, కోర్సులు పూర్తయినా చేతికి సర్టిఫికెట్లు రాక ఉద్యోగాలు, ఉన్నత చదువులు, విదేశీ అవకాశాలు కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు క్లియర్ చేయకపోవడం వల్ల విద్యార్థుల కెరీర్ పాడైపోవడమే కాకుండా, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ బయట ’చ్ఛాత్రోం కీ గూంజ్’ అని గొప్పలు చెబుతున్నారు సరే, కానీ హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర విద్యార్థుల ఆవేదనను వింటారా? లేదా? అని ఆయన ప్రశ్నించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉంటూ మాటల ప్రచారానికే పరిమితమైన రాహుల్ గాంధీ, కనీసం ఒక్కసారైనా రాష్ట్రం వైపు చూస్తారా? అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల టైమ్‌లో ఆయన అశోక్ నగర్‌కి వచ్చి 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని అవాస్తవమైన హామీలిచ్చారని, రెండేళ్లన్నర గడిచినా ఆ మాటలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీకి విద్యార్థులపై ప్రేమ ఉంటే, అదే అశోక్ నగర్‌లో ఈ ’చ్ఛాత్రోం కీ గూంజ్’ ప్రోగ్రామ్ పెట్టి, ఆయన హామీలిచ్చిన యువత అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రాంచందర్ రావు సవాల్ విసిరారు.








