హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. దీంతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో రైతులు పొలాల్లో నిల్వ నీరు తొలగించేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, వర్షాలు తగ్గే వరకు ఎరువులు, పురుగుమందుల పిచికారీని తాత్కాలికంగా నిలిపివేయాలని వ్యవసాయ వాతావరణ కేంద్రం సూచించింది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలవకూడదని, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.