
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇది చల్లటి వార్త. మండే ఎండల నుంచి రెండు రోజుల పాటు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మిగితా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. రాసున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదేస్థాయిలో కొనసాగి తదుపరి మూడు రోజుల్లో క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.













