సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడని, నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై సిఐ దౌర్జన్యం అంటూ మండిపడ్డారు. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా..లేక పోలీసు పాలనా..? అని సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం..ప్రజలపై పోలీసులతో జులుం..ప్రశ్నిస్తే కేసులు..నిరసిస్తే అరెస్టులు..హక్కులు అడిగితే దౌర్జన్యాలు..ఇదేనా సిఎం రేవంత్‌రెడ్డి చెప్పుకున్న ప్రజాపాలన..? అని నిలదీశారు. రాష్ట్ర డిజిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కారకులైన పోలీసులపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.