తిరుమలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి వద్ద భక్తులు నిత్యం పూజలు చేసే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తి ఒకరు అక్కడ కొలువై ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని అపహరించుకుపోయాడు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఒక కాషాయ గుడ్డలో చుట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుండి తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో విగ్రహం మాయం అవ్వడంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించలేదు. వెంటనే వారు టిటిడి అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.