
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. దీంతో స్వామివారిని సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్టుమెంట్లు వేచి ఉన్నారు. ఈ క్రమంలో తిరుమల వెంకన్నదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 10 నుంచి 12 గంటలు పడుతుంది.
ఇక, శనివారం శ్రీవారిని 85,246 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 34,085 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.3 కోట్లుగా ఉన్నట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.








