
త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో విజయ్ ప్రభుత్వం చర్యలు
బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన డిఎంకె
ప్రశ్నించి వదిలిపెడతామన్న ప్రభుత్వం, పోలీస్ స్టేషన్‌కు తరలింపు
చెన్నై: నటి త్రిషపై ద్వంద్వార్థం వచ్చే రీతిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారంనాడు ఉదయం నీలంకరాయిలోని ఆయన నివాసంలో ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డిఎంకె కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయనిధి అరెస్ట్‌కు ముందు ఆయన భార్యతో పాటు పలువురు డిఎంకె నేతలకు పోలీసులు సమాచారమిచ్చారు.
అనంతరం ఉదయనిధిని తంజావూరు సమీపంలోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. ఉదయనిధిని అరెస్ట్ చేసిన డిఎంకె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరింది. నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఆయనను ప్రశ్నించి వదిలిపెడతామని అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఉదయనిధిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తీసుకోవాలనే ఉద్దేశం పోలీసులకు లేదని, కేవలం విచారించి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ప్రశ్నించడం పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది.
కావేరీ జల వివాదంపై సోమవారం ఉదయనిధి తంజావురు సభలో మాట్లాడుతూ టీవీకే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో పలువురు కార్యకర్తలు ‘త్రిష.. త్రిష’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన నటి గురించి ద్వంద్వార్థం ధ్వనించేలా అనుచితంగా మాట్లాడారు. అనంతరం తాను చెప్పింది కావేరీ గురించేనని వివరణ ఇచ్చారు. ఇది కాస్త రాజకీయ దుమారానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా ఉదయనిధి మాట్లాడారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని పలు రాజకీయ పార్టీలు, ఖుష్బూ సహా పలువురు మహిళా నటులు డిమాండ్ చేశారు. అంతకుముందు స్టాలిన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకోగా, న్యాయస్థానం అత్యవసరంగా విచారణ జరిపి, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నించన తర్వాత విడిచి పెట్టాలని ఆదేశాలిచ్చింది.
దేనికైనా సిద్ధమే : ఉదయనిధి
అరెస్టు తరువాత ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ తాను ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి పరిణామాలకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. “నేను ఎవరినీ ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రైతుల సమస్యలపై విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు పాలక పక్షం వద్ద సమాధానం లేదు. కావేరీ జలాల వివాదంపై కూడా నోరు మెదపట్లేదు. ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు నేను నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తే నన్ను అరెస్టు చేశారు. ఎడిట్ చేసిన కొన్ని వీడియోలను వాళ్లు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు వార్తలను వ్యాపింప చేస్తున్నారు’ అని ఉదయనిధి అన్నారు.











