
రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్- 4, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ నియామక పరీక్షలు రాసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇబిసి, అనాథ అభ్యర్థులకు ఉచిత ఫౌండేషన్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలిపింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో నిర్వహించే ఈ పరీక్షకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇబిసి,
అనాథలు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించింది.ఈ కోచింగ్ 125 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపింది. ఆన్‌లైన్‌లో ఈ నెల 25 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, దరఖాస్తులు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 14 అని పేర్కొంది. కాగా కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 18న వెల్లడించనున్నట్లు పేర్కొంది. అనంతరం ఆగస్టు 20 నుంచి 24 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి కోచింగ్ ఇస్తారని పేర్కొంది.
అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఇవీ:
అభ్యర్థి తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2.00 లక్షలు మించరాదు. రెగ్యులర్ కోర్సు చదువుతున్న వారు, ఉద్యోగంలో ఉన్న వారు, గతంలో టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ పొందిన వారు అర్హులు కారు. ప్రతి నెల 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న అభ్యర్థులకు ఐదు నెలల పాటు నెలకు రూ.1,000 పుస్తక నిధి, రవాణా భత్యంతో కలిపి స్టయిఫండ్ మంజూరు చేయబడుతుంది. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు, ఆయా స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుందని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలిపింది.











