ఎనిమిది బిల్లులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వం

నేడు పార్లమెంట్ ముందుకు రెండు కీలక బిల్లులు

అయోధ్య విరాళాల దుర్వినియోగం, నీట్ ప్రశ్నపత్రం లీక్, పెట్రోల్‌లో ఇథనాల్, వాంగ్‌చుక్ దీక్ష భగ్నం

తదితర అంశాలపై నిలదీసేందుకు సిద్ధమైన విపక్షాలు

అఖిలపక్షం నుంచి విపక్షాల వాకౌట్

శివసేన సభ్యుల విలీనం, టిఎంసి ఎంపిలకు ప్రత్యేక సీట్ల కేటాయింపుపై నిరసన

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ప్రతిపక్షాల నిరసనతో ఉద్రిక్తంగా మారింది. తిరుగుబాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలను సమావేశానికి ఆహ్వానం పలకడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ లు ప్రతీకాత్మకంగా వాకౌట్ చేశాయి. అనంత రం నిరసన వ్యక్తం చేసిన తర్వాత తిరిగి సమావేశంలో పాల్గొన్నప్పటికీ, రానున్న వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగే సూచనలు కనిపించాయి. అధికారవిపక్షాల్లో సంఖ్యాపరమై న మార్పులు, కీలక బిల్లుల నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. మారిన పరిస్థితు ల్లో ఇవి వాడీవేడిగా జరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడుగా శనివారం మరో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి.

జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారుడు వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించడం మొదటిది. శివసేన యూబీటీ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు శిందే నేతృత్వంలోని శివసేనలో విలీనమయ్యేందుకు స్పీకర్ ఓం బిర్లా అ నుమతించడం రెండోది. సోమవారం సమావేశాలు మొదలయ్యే రోజే ‘మార్చ్‌టు పార్లమెం ట్’ ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనమహిళా రిజర్వేషన్ సంబంధిత బిల్లును ఎజెండాలో ఇంకా చేర్చలేదు. ప్రతిష్ఠాత్మకమైన బిల్లుపై సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు అధికార కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని తిప్పికొట్టాలని విపక్ష కూటమి పావులు క దుపుతోంది. ఈ కూటమితో తెగదెంపులు చేసుకున్న డీఎంకే తమకు విడిగా సీట్లు కేటాయించాలని ఇప్పటికే కోరింది. తృణమూల్‌నుంచి వి డిపోయి ‘నేషనలిస్ట్ సిటిజన్స్పార్టీ ఆఫ్ ఇండియా’లో చేరినట్లు ప్రకటించిన 20మంది ఎంపీలు తమకు విడిగా సీట్లు కేటాయించాలని కోరిన అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు. ఆ పార్టీలో భాగంగానే తమను గుర్తించాలన్న వినతిపై తుది నిర్ణయం వెలువడించాల్సి ఉంది.

అలాగే రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, నీట్ ప్రశ్నపత్రం లీక్, పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం వంటి అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు సమావేశంలో డిమాండ్ చేశాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను ఆలకించేందుకు సిద్ధంగా ఉందని, అదే విధంగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వాదనను వినాలని కోరారు. దేశ ప్రజలు పార్లమెంట్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారని, ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిరసనలు, గందరగోళం సృష్టించడం వల్ల ఎవరికీ రాజకీయ ప్రయోజనం ఉండదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సభలో చర్చల ద్వారా వ్యక్తం చేయాలని సూచించారు. సమావేశం ప్రారంభమైన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తిరుగుబాటు టీఎంసీ ఎంపీలకు సభలో ప్రత్యేక సీట్లు కేటాయించడం, అలాగే శివసేన (యూబీటీ) నుంచి విడిపోయిన ఎంపీలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం చేయడాన్ని నిరసించాయి.

కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ మాట్లాడుతూ, టీఎంసీ, శివసేన (యూబీటీ) తిరుగుబాటు ఎంపీల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయని తెలిపారు. సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్, తిరుగుబాటు టీఎంసీ ఎంపీలకు అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం ఇవ్వడం న్యాయానికి విరుద్ధమని విమర్శించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్షాలు, శివసేన (యూబీటీ) సహా మొత్తం ప్రతిపక్షం సమావేశం నుంచి వాకౌట్ చేసిందన్నారు. గుర్తింపు పొందని ‘నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)’కి ఆహ్వానం ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. శివసేన (యూబీటీ) నేత అరవింద్ సావంత్ కూడా తమ ఆరుగురు ఎంపీల విలీనాన్ని నిరసిస్తూ ప్రతీకాత్మకంగా వాకౌట్ చేసినట్లు తెలిపారు. చట్టంలో లేని విధంగా వారికి గుర్తింపు కల్పించారని ఆరోపించారు. మరోవైపు తిరుగుబాటు టీఎంసీ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన ఎన్‌సీపీఐ తరఫున 20 మంది ఎంపీలకు ఆహ్వానం రావడంతో సమావేశానికి హాజరయ్యామని చెప్పారు. ప్రతిపక్ష పాత్రను ప్రభుత్వం గుర్తించాలని, పార్లమెంట్ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలు, కీలక అంశాలపై చర్చల డిమాండ్ల నేపథ్యంలో ఈ సమావేశాలు తీవ్ర వాగ్వాదాలకు వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎనిమిది బిల్లులు: కిరణ్ రిజిజు

వర్షాకాల సమావేశాల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది బిల్లులను జాబితాలో చేర్చిందని, అవసరమైతే మరిన్ని అంశాలను నిబంధనల ప్రకారం చేర్చే అవకాశం ఉంటుందని రిజిజు తెలిపారు. గతంలో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా పార్లమెంట్ కార్యకలాపాలు పలుమార్లు స్తంభించాయని, దాంతో దేశ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనల ద్వారా రాజకీయంగా ఎవరూ లాభపడరని, అందుకే అన్ని పార్టీలు పూర్తి సహకారంతో సభా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరినట్లు చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ప్రతిపక్షాలు చేసిన సూచనలను ప్రభుత్వం నమోదు చేసుకుందని రిజిజు తెలిపారు. అయితే బిల్లులపై చర్చల్లో నిర్మాణాత్మకంగా పాల్గొని సానుకూల సహకారం అందించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, కిరెన్ రిజిజుతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.