
సప్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు
వైద్యులు సూచించిన చికిత్సకు నిరాకరిస్తున్న సోనమ్
మా అనుమతి లేకుండా చికిత్స వద్దు, ఆయనకు ఏదైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత
సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి
న్యూఢిల్లీ : నీట్ యూజీ సహా పోటీ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 21 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమరణదీక్షా స్థలి నుంచి శనివారంనాడు ఉదయం 7గంటలకు ఆయనను బలవంతంగా తరలించారు. సిజెపి తదితర కార్యకర్తలు, మద్దతుదారుల ప్రతిఘటన నడుమ ఆయనను ఇక్కడి సప్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. తెల్లని తెరలమాటున వచ్చిన కొంతమంది శిబిరం నుంచి వాంగ్‌చుక్‌ను క్షణాల్లో తరలించారు.
అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వాంగ్‌చుక్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ వెల్లడించారు. ఆయనకు చికిత్స అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. నిరసనకారులు సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. కొంతకాలంగా ఆయన నిరాహారదీక్షలో ఉన్నందున శరీరం డీహైడ్రేషన్‌కు గురైందని, ఆయన చికిత్స అవసరమని సప్దర్‌జంగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ ప్రస్తుతానికైతే నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే చికిత్స తీసుకునేందుకు వాంగ్‌చుక్ నిరాకరిస్తున్నారు. తన అనుమతి లేకుండా తన భర్తకు ఎలాంటి చికిత్స అందించవద్దని వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో డిమాండ్ చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే వైద్యులు, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. తమ వ్యక్తిగత వైద్యుడి సూచన లేకుండా ఏమీ చేయబోమని, ఆయన బాగానే ఉన్నారని అన్నారు. మరోవైపు సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పోలీసులపై ఆరోపణలు చేశారు. తనపై ఢిల్లీ పోలీసులు దాడి చేసి దిగ్బంధం చేశారని మండిపడ్డారు. వాంగ్‌చుక్‌ను తెరలమాటున తరలించిన తీరు జాతికి సిగ్గుచేటన్నారు.
ఖండించిన రాహుల్ సహా విపక్ష నేతలు..
వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసిన తీరుపై విపక్ష నేతలు మండిపడారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, పవన్ ఖేరా, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్, ఆప్ నేతలు కేజ్రీవాల్, పవార్ ఎన్‌సిపి తదితర పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అహింసా పద్ధతిలో దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను తప్పుడు పద్ధతిలో బలవంతంగా తరలించారని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న వారంతా అసత్యాలు, అహింసా పద్ధతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్‌లతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని అడగడం తప్పా అన్ని ప్రశ్నించారు.











