
వారం రోజుల్లో తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి....కోటి అశాలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి సమీప వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. కళ్యాణ వేడుకల నిర్వహణలో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా నెలకొన్న ఈ విషాదం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న, వినోదలకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కూతురు పెళ్లి అయింది. భూక్య సంగీత (19)ను తాను ప్రేమించిన మరిపెడ శివారు కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాను వివాహం చేసుకోనున్న
అరవింద్‌తో కలిసి సంగీత ఇటుగలగడ్డ తండాలోని వ్యవసాయ బావి వద్ద కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సంగీత ఇంటికి రాకవపోటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తండావాసులు బావిలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్సై కోటేశ్వర రావు బావిలో ఉన్న మృతదేహం వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కట్టుకోబోయే వాడే కాలయముడైయ్యాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆరోపిస్తున్నారు. హత్య, ఆత్మహత్య విచారణలో తేలాల్సి ఉంది.














