వాషింగ్టన్: వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తుండగా, సమీపం లోని వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. మంటలకు కారణమని భావిస్తున్న స్పోకేన్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్ వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో కార్చిచ్చు వ్యాపించింది. వందల భవనాలు అగ్నకి ఆహుతయ్యాయి. స్పోకేన్ ప్రాంతంలో మంటలు కొనసాగుతుండడంతో వాటిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నట్టు స్పోకేన్ మేయర్ లీసా బ్రౌన్ వెల్లడించారు.

వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి

తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన తర్వాత వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు ఈ వారం ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధ విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్న అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లకు ఇవి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. డ్రోన్‌ల వల్ల ఆదివారం 26 సార్లు అగ్నిమాపక కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని చెప్పారు.