
అదే మా ఆయుధం మా పనితీరుకు ప్రామాణికం
22ఎ పేరిట బిఆర్‌ఎస్ నేతలు దోచుకున్న ఆస్తులను వదిలిపెట్టం
సిట్‌తో ముక్కుపిండి వసూలు చేస్తాం
వచ్చే ఏడాది వ్యవసాయ, ఆబాదీ భూముల రీ-సర్వే పూర్తి
రెవెన్యూ మంత్రి పొంగులేటి
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ సమస్యలు లేని తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గురువారం సత్తుపల్లి మండలం నారాయణపురంలో భూ రీ-సర్వేపై నిర్వహించిన రైతుల ముఖాముఖి, అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో అవకతవకలు జరిగాయని, సాగులో ఉన్న పేద రైతులకు పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా భోగస్ వ్యక్తుల పేర్లపై భూముల రికార్డులు సృష్టించారని ఆరోపించారు. ప్రతి అంగుళం భూమికి టైటిల్: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములతో పాటు నివాస ప్రాంతాల (ఆబాదీ) భూములకు రీ-సర్వే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో తొలివిడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి, వచ్చే ఏడాదిన్నరలో సర్వే పూర్తి చేస్తామన్నారు.
రోవర్ టెక్నాలజీతో భూములను శాస్త్రీయంగా కొలిచి, కోఆర్డినేట్స్, మ్యాప్‌లతో కూడిన పక్కా హక్కుల టైటిల్ డీడ్‌లను రైతులకు అందిస్తామని చెప్పారు. 22 ఏ నిషేధిత భూముల వ్యవహారంలో గత ప్రభుత్వ హాయాంలో అక్రమాలకు పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని పొంగులేటి హెచ్చరించారు. ప్రజలను అడ్డుపెట్టుకుని వేలాది ఎకరాల అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని, అక్రమంగా దోచుకున్న సొమ్మును ముక్కుపిండి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు స్వయంగా వెళ్లి రైతులతో మాట్లాడి భూ సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.








