
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ’చలో సంసద్’ మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు వ్యహరించిన తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే పోలీసు చర్యపై తక్షణం జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని, వీడియోలు చూసే సమయం తమకు లేదని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నిరసనకారులపై పోలీసు చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించడంతో సీజేఐ సూటిగా స్పందించారు. వీడియోలపై తమకు అసక్తి లేదని, చూసే సమయం కాడా లేదని అన్నారు. ’మా సమయం వృథా చేయొద్దు, మీ సమయం కూడా వృథా చేసుకోకండి’ అని ఆయన సూచించారు.
నీట్-యూజీ 2026 పేపర్ లీక్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో పరీక్షల నిర్వహణ, సంస్కరణలతో సహా ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై విద్యార్థులు నిరసనలు చేపట్టినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా ’థాంక్యూ వెరీ మచ్’ అంటూ సీజేఐ అన్నారు. పోలీసుల దమనకాండపై వీడియోలను తిరిగి న్యాయవాది ప్రస్తావించగా, తమకు అంత సమయం లేదని, విడియోలు చూడాలని అనుకోవడం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. కాగా, ఈ పిటిషన్ అత్యవసర విచారణను ఢిల్లీ హైకోర్టు సైతం మంగళవారంనాడు నిరాకరించింది. ఈ అంశంలోకి తమను లాగవద్దని వ్యాఖ్యాననిచింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.











