
పవిత్ర గ్రంథం ‘భాగవత మహాపురాణం’ త్వరలో వెండితెరపైకి రానుంది. గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా బాలీవుడ్‌కు చెందిన నిర్మాణ సంస్థ ‘సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ‘శ్రీమద్భాగవతం’ పేరుతో లైవ్ యాక్షన్ ఫిల్మ్ సిరీస్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ పురాణగాథను మొత్తం ఏడు భాగాలుగా తెరకెక్కించనున్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఏడు రోజుల భాగవత పారాయణ సంప్రదాయం స్పూర్తిగా ఈ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. దీనికి ‘సప్తి’ అని నామకరణం చేశారు. ఈ ఫ్రాంచైజీలోని ఏడు భాగాలు ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.











