వాషింగ్టన్: వెనెజువెలాతో ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంతో వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించనున్నట్టు ఆయన తెలిపారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ ద్వారా ఈ ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ ఈ ఒప్పందం కోసం పనిచేశారని ట్రంప్ తెలిపారు.

ప్రైవేటురంగ భాగస్వామ్యం ద్వారా ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందంతో అమెరికా చమురు నిల్వలు రెట్టింపుకంటే ఎక్కువగా పెరుగుతాయని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంలో ఏయే చమురు క్షేతాలు ఉన్నాయి, అమెరికా నియంత్రణ ఏరూపంలో ఉంటుంది, ఏ ప్రైవేటు కంపెనీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయనే వివరాలను అమెరికా ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ ఒప్పందం ద్వారా వెనిజువెలాలో 100 బిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని, అమెరికాలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని రూబియా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ఈ ఒప్పందంపై వెనెజువెలా మీడియా ప్రభుత్వ మీడియా కార్యాలయం మాత్రం వెంటనే స్పందించలేదు.

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం ట్రంప్ ఆదేశాల మేరకు పట్టుకుని ఫెడరల్ నార్కో టెర్రరిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలను ఎదుర్కొనేందుకు అమెరికాకు తరలించిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ ఒప్పందం ప్రకటన వెలువడింది.

కాగా, ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు కలిగిన దేశాల్లో వెనెజువెలా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉండగా, ఇది ప్రపంచ మొత్తం చమురు నిల్వల్లో దాదాపు 17 శాతంగా ఉంది. ఇంత భారీ చమరు నిల్వలు వెనెజువెలాకు ఉన్నప్పిటకీ చమురు ఉత్పత్తి సామర్థ్యం మాత్రం చాలా తక్కువగా ఉంది.