
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన, వారిపై పోలీసు చర్యకు సంబంధించి పూర్తి స్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారంనాడు ప్రకటించారు. చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాధానం ఇస్తారని, అయితే చర్చకు సమాధానం ఇస్తున్న సమయంలో విపక్షాలు సభలో ఎలాంటి అంతరాయం కలిగించమనే హామీ ఇవ్వాలని కోరారు. లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశానంతరం మీడియాతో రిజిజు మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్చపై పూర్తిస్థాయిలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు లోక్‌సభ బీఏసీ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలిపారు.
‘చర్చలో ప్రభుత్వం తరఫున హోం మంత్రి పాయింట్-టు-పాయింట్ సమాధానం ఇస్తారు. ఆయన ఇచ్చే సమాధానాన్ని ఓపిగ్గా వినాలి. నినాదాలు చేయడం, గందరగోళం సృష్టించమని ప్రతిపక్షాలు హామీ ఇవ్వాలి. మేము చర్చకు ఆఫర్ ఇచ్చాం. ఇక ప్రతిపక్షాలు చర్చలో పాల్గొని మాకు సహకరించాలి’ అని అన్నారు. చర్చ జరగాలంటే తగిన డీకోరమ్ ఉండాలని రిజిజు అన్నారు. ఏ అంశంపై చర్చించేందుకైనా ప్రభుత్వం సిద్ధమని, వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని, ఇకముందు కూడా ఉండదని రిజిజు స్పష్టం చేశారు.
అయోధ్య విరాళాల అంశం చర్చపై..
అయోధ్యలో రామాలయం విరాళాల చోరీ ఆరోపణలపై మంత్రి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు జరుపుతోందని, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మరిన్ని చర్చలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. దానిపై తాను ఎలాంటి కామెంట్ చేయలేనని చెప్పారు. కేవలం విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేసేందుకే తాను ప్రస్తుతానికి పరిమితమని అన్నారు.
ప్రభుత్వం పారిపోతోంది..
కాగా, రిజిజు ప్రకటనపై కాంగ్రెస్ సూటిగా స్పందించింది. అయోధ్య రామాలయం విరాళాల చోరీ ఆరోపణలపై కూడా హోం మంత్రి సమాధానం ఇస్తారా? అని లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. రిజుజు ప్రకటన విపక్షాలను తప్పదారి పట్టించేలా ఉందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతల నుంచి పారిపోతోందని విమర్శించారు.
రాజ్యసభలోనూ..
మరోవైపు, రాజ్యసభలోనూ కిరణ్ రిజిజు మాట్లాడుతూ... ‘పార్లమెంటు సమావేశాల తొలిరోజు నుంచి విద్యార్థుల ఆందోళన, పోలీసు చర్యపై హోం మంత్రి సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్ధంగా ఉంది. చర్చపై సమాధానం కూడా ఇస్తుంది. హోం మంత్రి సమాధానం ఇస్తున్నప్పుడు వాకౌట్ చేయవద్దని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను’ అని అన్నారు. జులై 20న మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు విపక్షాల ఆందోళనల మధ్య ఇంతవరకూ ఎలాంటి సభాకార్యక్రమాలకు నోచుకోలేదు. అయితే పేపర్ లీక్ నిరోధక బిల్లు- ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై చర్చ జరిగి, పార్లమెంటు ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ మరో మూడు బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా ఆమోదం పొందగా, రెండు బిల్లులను లోక్‌సభ ఆమోదించింది.











