
మన తెలంగాణ/హైదరాబాద్‌ః విద్యార్థులను ‘ఇడియట్స్‘ అని అవమానించిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థులను అవమానించడం భావ్యం కాదని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులను అవమానించినందుకు రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘నీట్’ సంస్కరణలపై చర్చను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మందికి పైగా విద్యార్థుల మరణాలకు కారణం కాంగ్రెస్సేనని ఆయన తూర్పారపట్టారు. అప్పడు కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం చేసిన ప్రకటన, యూ-టర్న్‌తో విద్యార్థులు ఆత్మబలిదానాలకు దిగారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తుపాకీ గుళ్లకు బలైన విద్యార్థులపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణకు వచ్చి ’యూత్ డిక్లరేషన్’ పేరిట ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. యువతను మభ్యపెట్టి మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల చావులకు కారణమైనందుకు, ఇచ్చిన హామీలను విస్మరించినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు.











