
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
దీనికి ముందు విద్యాశాఖ మంత్రి పదవిని తనకు అప్పగించడంపై ప్లహ్లాద్ జోషి స్పందించారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నిర్దేశకత్వంలో నిబద్ధతతో తన బాధ్యతలు నిర్వహిస్తాననిఅన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యారంగంలో ఎన్నో విజయాలు అందుకున్నారని, జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు.
ధర్మేంద్ర ప్రధాన్ సైతం తన రాజీనామా లేఖలో, తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తననెంతో బాధించాయని తెలిపారు. మంత్రిగా తాను బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పుకేలేదని, మాఫియా కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదనే సంకల్పంతోనే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.











