న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం మరోసారి నిజమైంది. తమిళనాడులో సారి విజయ్ సారధ్యంలోని టివికె 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని గత ఏడాది మార్చిలో కుండబద్ధలు కొట్టారు. పికె ఏడాది క్రితమే చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఈ వీడియో దాచి పెట్టుకోండి. ఫలితాల తరువాత ప్లే చేయండి’ అని ఆ వీడియోలో ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. ప్రశాంత్ కిషోర్ గత ఏడాది మార్చిలో తంతి టివికి ఇంటర్వ్యూ ఇచ్చారు.

టివికెకు ఏడాది నిండిన సందర్భంగా ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ ఆ మేరకు సమాధానమిచ్చారు. విజయ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారని, అదే జరుగుతుందని అనుకుంటున్నానని పికె అప్పుడు పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ ‘ఐ-ప్యాక్’ పొలిటికల్ వ్యూహాత్మక సంస్థ తమిళనాడులో టివికెతో కలిసి పనిచేసిందనే వార్తలు కూడా వచ్చాయి.కానీ వాటిని ఆయన తోసిపుచ్చారు. తాను విజయ్ మంచి స్నేహితులమని తెలిపారు.